టీడీపీ 41వ ఆవిర్భావ దిన వేడుకలను అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. తానా పూర్వాధ్యక్షుడు సతీష్ వేమన, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్యఅతిథులుగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ 9 నెలల్లోనే తెలుగు బావుటా ఎగురవేసిన యుగపురుషుడని కీర్తించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు ప్రవాసాంధ్రుల పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు అధికార పార్టీకి, ప్రభుత్వ అధికారులకు ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. మన్నవ సుబ్బారావు, ఎన్ఆర్ఐ భాను మాగులూరి, వాషింగ్టన్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, కార్తీక్ కోమటి, జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షుడు కృష్ణ లాం తదితరులు పాల్గొన్నారు.