రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో శ్రద్ధతో రైతులకు సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శుక్రవారం నరసన్నపేట పి ఏ సి ఎస్ సొసైటీ కార్యాలయంలో స్థానిక అధ్యక్షులు పాగోటి ప్రభాకర్ రావు అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఒక్క సొసైటీ నుండి సుమారు 27 కోట్ల రూపాయల రుణాలను వివిధ పథకాల ద్వారా రైతులకు అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ ఏడాది లక్ష్యానికి మించి తొమ్మిది కోట్ల 50 లక్షల రూపాయలు రుణాలు రైతులకు అందజేసినట్లుగా తెలిపారు. అంతేకాకుండా ఈ ఒక్క సొసైటీ ద్వారా 24 కోట్ల రూపాయలతో 12 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మొదటి స్థానంలో ఉండడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. రైతులకు మరిన్ని సేవలను అందించాలని, ఎటువంటి ఇబ్బందులు రానీయవద్దని కార్యవర్గ సభ్యులకు సంబంధిత సిబ్బందికి ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరంగి మురళీధర్, జడ్పిటిసి ప్రతినిధి చింతు రామారావు, సొసైటీ సభ్యుడు అంపోలు సుధా, సీఈవో కూర్మాన ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.