జీవిత పర్యంతం దేశ సేవకే అంకితమై నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడు బాబు జగజీవన్ రామ్ అని పోలాకి మండల ప్రజాపరిషత్ పరిపాలన అధికారి బలగ సూర్యప్రకాశరావు అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆలోచనల్లోని పరిపక్వత, మాటల్లోని సూటిధనం, నిర్ణయాల్లో లోతైన అవగాహన, కష్టాల్లో కృంగిపోక మొక్కవోని ధైర్యం ఆయన సొంతమని పేర్కొన్నారు. అంతే కాకుండా చర్చల్లో పదునైన మేధావితనం, ప్రత్యర్ధులతో సైతం ఔరా అనిపించే రాజనీతిజ్ఞత, తర్కం, లోతైన విషయ పరిజ్ఞానం ఆయన నాయకత్వ విలక్షణతలు కలిగినవారని వివరించారు. అనంతరం ఆయనతోపాటు స్థానిక మండల పరిషత్ సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.