గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధిని చూపించడం ద్వారా వలసలు నివారించడం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, జలవనరులను పునరుద్ధరించడం, భూగర్భ జలమట్టాన్ని పెంపొందించడం ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశమని నరసన్నపేట క్లస్టర్ ఏపీడి శైలజ పేర్కొన్నారు. బుధవారం నరసన్నపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో నరసన్నపేట క్లస్టర్ పరిధిలో ఉన్న సాంకేతిక సహాయకులతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది సమన్వయం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి అంచనాలు రూపొందించాలన్నారు. అన్ని గ్రామపంచాయతీలోనూ పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
లేబర్ కాంపోనెంట్ పనులు ఎంత ఎక్కువగా జరిగితే అదే స్థాయిలో మెటీరియల్ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు అవుతాయని తద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు పెంపొందించేందుకు గాను అంతర్గత రహదారులు, లింకు రోడ్లు, వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మించుకోవచ్చు అన్నారు. అంతేకాకుండా ఇటీవల ఉపాధి వేతనదారుల వేతనం కూడా పెంచడం జరిగిందని దానికి అనుగుణంగానే పని ప్రదేశాలలో వేతనదారులకు వారు చేయవలసిన పనిపై అవగాహన కల్పించాలని, కొలతల మేర పనులు చేయించాలని తెలిపారు. గరిష్ట వేతనం రూ 272 వచ్చే విధంగా సిబ్బంది చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు, గార, సారవకోట, శ్రీకాకుళం మండలాలకు చెందిన సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు.