చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చెందిన జగన్ సేవాదళ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తిరెడ్డి బుధవారం ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఆయనను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. తమ వైసీపీకే చెందిన గుడిపాల ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి, అతడి అనుచరుల వేధింపులు తాళలేక తాను ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన తనపై ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి, అతడి అనుచరులు దాడి చేశారన్నారు. ఎంపీపీ అనుచరులు శ్యామ్, అప్పు, ప్రాంక్లిన్ కలిసి తనను, తన బంధువులను బెదిరిస్తున్నారని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అండతోనే తనపై దాడికి పాల్పడుతున్నారని, తనపై దాడికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.