‘‘దేశంలో అత్యధిక వృద్ధిరేటు ఆంధ్రప్రదేశ్‌దేనని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పడం హాస్యాస్పదం. రాష్ట్ర స్థూల ఆదాయం ఎలా పెరిగిందో, ఆ రహస్యమేమిటో స్పష్టం చేయాలి’’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాళెం విజయకుమార్ డిమాండ్ చేశారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘వ్యవసాయంలో వృద్ధిరేటు 36.19 శాతం, పారిశ్రామిక రంగంలో 23.36 శాతం, సర్వీస్ రంగంలో 40.45 శాతం ఉన్నట్లు ఇటీవల ఆర్థిక మంత్రి తెలియచేశారు. ఎంతో సందేహాస్పదమైన గ్రోత్‌రేట్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పు మీద అప్పులు చేస్తోంది. సమయానికి ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, డీఏ, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయంలో 6 శాతం ప్రొడక్షన్ సెక్టార్‌లో ఉంటే మరి జీఎ్‌సడీపీ 16.2 శాతం ఎలాపెరిగింది? జిల్లాల వారీగా పరిశీలిస్తే స్థలాల రిజిస్ట్రేషన్ ఆదాయం బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం ఎలా పెరిగిందో ఒక క్లారిటీ ఇవ్వాలి’’ అని విజయకుమార్ డిమాండ్ చేశారు. మరో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ... ‘‘ఇప్పటికే అనేక మంది పార్టీలోకి రావాలని చూస్తున్నారు. అయితే టీడీపీలోకి తీసుకునేటప్పుడు అతని గుణగణాలు బేరీజు వేసుకుని పార్టీ అధినేత చంద్రబాబు పార్టీలో చేర్చుకుంటారు. అంతేగాని ఎవరినిబడితే వారిని చేర్చుకోం’’ అని స్పష్టం చేశారు.