బాపట్ల జిల్లా ఆవిర్భావ వేడుకల్లో మంగళవారం బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు దళితుల, వివిధ రాజకీయ పక్షాల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయా వర్గాలు డిమాండ్ చేశాయి. బాపట్ల లోక్‌సభ స్థానాన్ని ఎస్సీ రిజర్వ్‌డ్ చేయడం చారిత్రక తప్పిదమని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ప్రధాన ప్రతిపక్షమయిన టీడీపీ తీవ్రంగా తప్పు బట్టింది. దళితుల ఓట్లతో గద్దెనెక్కి నేడు వారినే అవమానించే విధంగా మాట్లాడడం సరికాదంది. దళిత ద్రోహిగా ఎమ్మెల్యే కోనను టీడీపీ అభివర్ణించింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఎ్‌సపీ, వివిధ దళిత సంఘాలు సైతం ఎమ్మెల్యే రఘుపతి వ్యాఖ్యలు అగ్రకుల అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని మండిపడ్డాయి. దళిత సంఘాలన్నీ ఒకే వేదికమీదకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పేవరకు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేయడానికి కార్యాచరణను రూపొందించడానికి సన్నద్ధమయ్యాయి.