ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద దివ్యాంగుడికి... ఐటీ షోకాజ్ నోటీస్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 07:58 PM

పేద దివ్యాంగుడికి ఐటీ శాఖ నోటీసులు జారీచేసి షాక్ గురిచేసింది.  దివ్యాంగుడైన ఓ వ్యక్తి.. బ్యాంకు నుంచి రుణం తీసుకుని చిన్న స్టేషనరీ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అయితే, రూ.12 కోట్లకుపైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు ఆదాయపు పన్ను నోటీసు జారీ చేయడంతో షాకయ్యాడు. విస్తుగొలిపే ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారాలో చోటుచేసుకుంది. భిల్వారాలోని సంజయ్ నగర్‌కు చెందిన కిషన్‌ గోపాల్‌ ఛపర్వాల్‌ (38) రూ.12.23 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లుగా ఐటీ షోకాజ్‌ నోటీసు అందుకున్నాడు. బ్యాంకు రుణం తీసుకొని చిన్న స్టేషనరీ షాపు నడుపుతోన్న కిషన్.. పెళ్లిళ్ల సీజనులో ఫొటోగ్రాఫరుగా వెళుతుంటారు.


ఎంత కష్టపడినా నెలకు రూ.10 వేలు సంపాదన మించడం లేదని, అలాంటిది రూ.12 కోట్లకుపైగా లావాదేవీలు జరిపినట్టు నోటీసు రావడంతో కుటుంబానికి నిద్ర కరువైందని వాపోతున్నాడు. ఈ విషయమై స్థానిక ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ను కిషన్‌ గోపాల్‌ సంప్రదించగా.. ఆయన పాన్‌ కార్డును దుర్వినియోగం చేస్తూ ముంబయి, సూరత్‌లకు చెందిన రెండు వజ్రాల షెల్‌ కంపెనీలు రూ.కోట్లలో బోగస్‌ లావాదేవీలు నడిపినట్లు తేలింది. దిక్కుతోచని స్థితిలో సుభాష్‌ నగర్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.


‘‘బ్యాంకు రుణం తీసుకుని దుకాణం పెట్టుకున్నాను.. నెల నెల వాయిదాలే సరిగ్గా చెల్లించలేకపోతున్నాను.. నెలకు రూ.8,000 నుంచి రూ.10,000 వరకూ వస్తోంది.. నేను ఎటువంటి బోగస్ కంపెనీలను నిర్వహించలేదు.. కొందరు నన్ను మోసం చేశారు.. రూ.12.23 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్టు ఐటీ అధికారుల నుంచి నోటీసు అందింది.. నా పాన్ కార్డును ఎవరు ఉపయోగించారో తెలియదు.. ఈ విషయంలో నాకు ఉపశమనం కలిగించాలని అధికారులను వేడుకుంటున్నాను’’ అని కిషన్ పేర్కొన్నాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేశామని, అన్ని విషయాలను పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com