దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతోంది. గడచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు 5 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా 5,335 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ముందురోజుతో పోల్చితే ఇది 20 శాతం అధికం. గతేడాది సెప్టెంబరు 23 తర్వాత రోజువారీ కేసులు 5 వేలు దాటడం ఇదే తొలిసారి. రోజువారీ కరోనా కేసులు పెరుగుదలతో దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల 25,587గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు కూడా ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4 శాతానికి చేరువకాగా.. వీక్లీ పాజిటివిటీ 3 శాతానికి దగ్గరగా ఉంది.
కోవిడ్ బారినపడ్డ మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేరళలో సవరించిన ఏడుతో పాటు కొత్తగా ఒకటి ఉన్నాయి. మహారాష్ట్ర ఇద్దరు, కర్ణాటక ఇద్దరు, పంజాబ్ ఒకరు చనిపోయారు. కరోనా నుంచి గత 24 గంటల్లో మరో 2,826 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,41,82,538కి చేరింది. గత రెండు వారాలుగా కరోనా కేసుల పెరుగుదలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండేందుకు ప్రభుత్వాలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు.
కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తి మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 26 శాతం దాటేయడం గమనార్హం. పదిహేను నెలల తర్వాత అక్కడ ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు పెరగడం ఇదే మొదటిసారి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ అక్కడ 509 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో ఎటువంటి విపత్తును ఎదుర్కొడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అన్నారు. ఎటువంటి ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
యూపీలో గత 24 గంటల్లో 163 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. లక్నోలో బుధవారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. యూపీ మంత్రి సూర్య ప్రతాప్ సాహ్నితో పాటు అతని కుటుంబసభ్యుల్లో ఒకరు వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్-వేరియంట్ XBB.1.16 ఉన్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒమిక్రాన్ రీకాంబినెట్ స్పైక్‌లోని ఉత్పరివర్తనాలు వైరస్ వేగంగా వృద్ధి చెందడానికి దోహదపడతాయని SARS-CoV-2ను ట్రాక్ చేసే నిపుణులు అంటున్నారు.