అనంతపురం జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ధారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ డోర్ తెరుచుకుంటే లిఫ్ట్ వచ్చిందనుకున్నాడు. లోపల అడుగు పెట్టాడు. కానీ, అది రాలేదు. ఘోరం జరిగిపోయింది. నాలుగో అంతస్తు నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యాడు 70 ఏళ్ల ఓ వ్యక్తి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పలకరించేందుకు వచ్చి అనంతలోకాలకు వెళ్లిపోయారు. అనంతపురం పట్టణంలోని ఓ ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
సత్యసాయి జిల్లా ఒడిసి మండలం శేషయ్యవారిపల్లికి చెందిన అశ్వర్థప్ప (70 ఏళ్లు) అనంతపురం పట్టణంలోని చంద్ర హాస్పిటల్‌లో నాలుగో అంతస్తులో ఉన్న బంధువులను చూసేందుకు వచ్చారు. బంధువులతో మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చారు. అక్కడ లిఫ్ట్ కోసం చూస్తుండగా.. సడెన్‌గా లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. లిఫ్ట్ వచ్చిందేమో అనుకొని లోపల కాలు పెట్టారు. కానీ, అప్పటికి ఇంకా లిఫ్ట్ రాకపోవడంతో.. కిందపడిపోయారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అశ్వర్థప్ప వెంట మరో వ్యక్తి లిఫ్ట్ వద్దకు వచ్చారు. ఆయన లిఫ్ట్ గొయ్యిలో పడిపోవడంతో.. ఆందోళనగా కిందికి పరుగెత్తి చూశారు. అశ్వర్థప్ప రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించారు. లిఫ్ట్ వద్ద వెలుతురు తక్కువగా ఉండటం కూడా ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. లిఫ్ట్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
లిఫ్ట్ రాకుండానే డోర్ ఎందుకు తెరుచుకుందని అశ్వర్థప్ప కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల లిఫ్ట్ రాకుండానే గేటు తెరుచుకుందని, ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల కిందటే లిఫ్ట్ మెయింటెనెన్స్ చేపించామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.