ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుట ఎమోషనల్ అయ్యారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిందని సీఎం జగన్మోహన్ రెడ్డే అంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని భావోద్వేగానికి గురయ్యారు. రాబోయే ఎన్నికల్లో దిక్కులు పిక్కటిల్లేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఉండబోతుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెట్టారని.. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో వైద్య రంగానికి ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఒక ముఖ్యమంత్రి నాలుగేళ్లలో ఎంత చేయవచ్చో.. సీఎం జగన్ ఆరోగ్య రంగంలో చేసి చూపించారని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. దుష్టచతుష్టయం ఎన్ని పన్నాగాలు పన్నినా, భూమి చీలినా, నింగి కుంగినా, అన్యాయానికి ఓటమి తప్పదని.. చంద్రబాబు ఓటమి- జగనన్న గెలుపు తథ్యమని విడదల రజిని భావోద్వేగం చెందారు. చంద్రబాబు నలుగురు ఎమ్మెల్యేలను కొనగలరు కానీ, జగనన్న కోసం ప్రాణాలు ఇచ్చే 4 కోట్ల మంది ప్రజలను మాత్రం కొనలేరని వ్యాఖ్యానించారు. ఒక సాధారణ మహిళనైన తనకు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తన రాజకీయ జీవితం, పదవులు, రాజకీయ భవిష్యత్తు అంతా సీఎం జగన్ పెట్టిన భిక్షేనంటూ భావోద్వేగంతో మంత్రి రజిని కంటతడి పెట్టారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య రంగంలో చరిత్ర సృష్టించారని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం ప్రవేశపెట్టడం ద్వారా తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్ చరిత్ర సృష్టిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ ప్రజారోగ్యంపై దృష్టి పెట్టలేదన్నారు. మహా నగరాల్లో ధనవంతులకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారని.. ఇప్పుడు గ్రామాల్లో ఉండే పేదలకు కూడా ఫ్యామిలీ డాక్టర్ ఉండబోతున్నారని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం, విలక్షణమని.. ఇది సీఎం జగన్ మానసపుత్రిక అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.
సీఎం జగన్ ఆశయాలే లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నానని మంత్రి విడదల రజిని తెలిపారు. భారత దేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ ఏనాడో చెప్పారని.. పల్లె సీమలే దేశానికి పట్టుకోమలని మన సీఎం జగన్ బలంగా నమ్మారన్నారు. అందుకే వాలంటీర్ వ్యవస్థ తెచ్చారని, ఆ వ్యవస్థ ఆత్మబంధువుల్లాగా పని చేస్తోంది. వెలుగు కావాలంటే సూర్యుడు కావాలి.. ఊపిరి కావాలంటే వాయుదేవుడు కావాలి.. పంట పండాలంటే వరుణ దేవుడు కావాలి.. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి.. మళ్లీ మళ్లీ జగనన్నే రావాలి అని ఆకాంక్షించారు. ఏపీ ప్రస్తుతం మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు అంటోందని.. జై జగన్ అంటూ మంత్రి విడదల రజిని నినాదాలు చేశారు.