తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చి తాజాగా మరో కేరళకు చెందిన భక్తుడు కూడా తన బ్యాగ్ మర్చిపోయి వెళ్లిపోయారు. తిరుమల నుంచి వెళ్లిపోయాక బ్యాగ్ సంగతి గుర్తుచేసుకుని.. మళ్లీ తన డ్రైవర్‌ను పంపారు.. టీటీడీ సిబ్బంది ఆయన బ్యాగును తిరిగి జాగ్రత్తగా అప్పగించారు. ఈనెల 3న కేరళకు కృష్ణకుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు శ్రీవారి దర్శనార్థం వచ్చారు. ఎంబీసీ పరిధిలో ఉన్న నారాయణగిరిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. స్వామివారిని ఆ కుటుంబం దర్శించుకుంది.. అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ఆయన తన బ్యాగ్ మర్చిపోయి వెళ్లిపోయారు.
భక్తుడు మర్చిపోయి వెళ్లిన బ్యాగులో ల్యాప్‌ట్యాప్‌తో పాటూ కారు, ఇంటి తాళాలు, మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. తిరుమలలో తన బ్యాగ్ మర్చిపోయిన విషయాన్ని బుధవారం గుర్తించారు. వెంటనే కృష్ణకుమార్ కరకంబాడిలోని మాధవనగర్‌లో నివాసం ఉంటున్న తన డ్రైవర్‌ను తిరుమలకు పంపించారు. ఆయన తిరుమలకు వచ్చి ఆరా తీయగా.. ఎంబీసీ విచారణ కార్యాలయంలో బ్యాగును జాగ్రత్త చేసినట్లు అక్కడి సిబ్బంది చెప్పారు. కృష్ణకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడిన టీటీడీ అధికారులు వస్తువులను డ్రైవర్‌కు అందజేశారు. దీంతో కృష్ణకుమార్ టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు.
గతంలో కూడా తిరుమలకు వచ్చిన ఓ హైదరాబాద్ భక్తురాలు కూడా టీటీడీని అభినందించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సమయంలో తన మొబైల్ పోయిందని.. తాను వెంటనే విజిలెన్స్ కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదు చేయగానే సీసీ ఫుటేజీ పరిశీలించారన్నారు. గంటలోనే తన మొబైల్ గుర్తించి అప్పగించినట్లు తెలిపారు. తన మొబైల్ గురించి ఫిర్యాదు చేసిన దగ్గర నుంచి తిరిగి అప్పగించే వరకు గౌరవంగా వ్యవహరించాని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవోకు మెయిల్ పంపారు.
మరో మహారాష్ట్ర భక్తుడు కూడా బ్యాగ్ మర్చిపోయారు. ట్యాక్సీని బుక్ చేసుకున్న ఆయన.. హడావుడిలో కారు దిగే సమయంలో బ్యాగును మర్చిపోయారు. కొద్దిసేటికి బ్యాగ్ లేదని గుర్తించి వెంటనే టీటీడీ విజిలెన్స్, తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగి ఆ బ్యాగ్‌ను కనిపెట్టి భక్తుడికి అందజేశారు. ఆయన కూడా విజిలెన్స్, పోలీస్ సిబ్బందిని అభనందిస్తూ మెయిల్ పంపారు. ఇలా టీటీడీ భక్తుల భద్రతతో పాటూ వారి వస్తువుల విషయంలో కూడా కేర్ తీసుకుంటోంది.