టెక్కలి టికెట్ విషయంలో తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. కొందరు తమ కుటుంబంలో విభేదాలు తేవాలని దురాలోచనతో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తన సతీమణి వాణి టెక్కలి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని.. ఇదంతా చూసి తట్టుకోలేక అక్కసుతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
తమ కుటుంబంలో విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు తామ ముందుకెళ్తున్నామని.. తన భార్య వాణి, తాను కలిసే పని చేస్తున్నామన్నారు. తామేమీ శత్రువులం కాదని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. 18 నెలల ముందే తన భర్తకు ఎమ్మెల్యే టికెట్ ముఖ్యమంత్రి ఖరారు చేశారన్నారు టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు వాణి. ప్రతిపక్షంలో భయం ఏర్పడి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎత్తుగడలు మొదలు పెట్టారని.. తన భర్త విజయం కోసం కుటుంబంతో కలిసి ప్రచారంలో కష్టపడతాను అన్నారు.
కొద్దిరోజులుగా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి టెక్కలి టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరిగింది. వాణి అధిష్టానానికి తన మనసులో మాట చెప్పారంటూ ఊహాగానాలు వచ్చాయి. పార్టీ పెద్దల్ని కలిసినట్లు కొన్ని కథనాలు వచ్చాయి. దీంతో దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణితో కలిసి ఈ ప్రచారంపై స్పందించారు.. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు.
దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా.. 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన శ్రీనివాస్.. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో టెక్కలి నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేసి ఓడారు.. 2019లో శ్రీకాకుళం లోకసభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
టెక్కలి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో సీఎం జగన్ దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన్ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.. 2021లో శాసనమండలిలో అడుగుపెట్టారు. అలాగే సీఎం జగన్ కూడా నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశంలో దువ్వాడ శ్రీనివాస్‌కు టికెట్ ఖాయమని తేల్చి చెప్పారు. ఇంతలో ఇంట్లో టికెట్ పంచాయితీ అంటూ ప్రచారం జరగడంతో నేరుగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ స్పందించి.. దీనిపై క్లారిటీ ఇచ్చారు.