ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా.. 9వ తేదీన తమిళనాడులోని ముదుమలైలోని టైగర్ రిజర్వ్‌కు వెళ్లి.. ది ఎలిఫెంట్ విస్పరర్స్ స్టార్స్, ఏనుగుల సంరక్షకులు బెల్లీ, బొమ్మన్‌లను కలవనున్నారు. అంతేకాదు వీరిని ప్రధాని మోదీ స్వయంగా సత్కరించనున్నారు.
ముదుమలైలోని టైగర్ రిజర్వ్‌లోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని ప్రధాని మోదీ అధికారికంగా సందర్శించనున్న నేపథ్యంలో.. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రారంభించారు. మోదీ రావడం ఖాయం కావడంతో.. ఆ ప్రాంతంలోని గ్రామాల పరిస్థితి కూడా మారిపోయింది. రాళ్లతో కూడిన మట్టి రోడ్డుపై తారు పడింది. రోడ్డు పక్కన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మోదీ రాక నేపథ్యంలో ఈ ప్రాంతంలోని ప్రజలకు, పర్యాటకులకు ఆంక్షలు విధించారు. అటవీ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని.. బందోబస్తు కోసం పోలీసు గస్తీని ఏర్పాటు చేశారు.
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' అనే డాక్యుమెంటరీకి కార్తికే గోన్సాల్వేస్ దర్శకత్వం వహించారు. ఇది ఆమె మొదటి డాక్యుమెంటరీ చిత్రం. ఆ మొదటి ప్రయత్నానికి ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ లభించిన తర్వాత.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఈ బృందాన్ని అభినందించారు. త్వరలో ప్రధాని మోదీ స్వయంగా వారి దగ్గరకు వెళ్లనున్నారు.