2007 ఆగస్టు 20వ తేదీన కూంబింగ్ కోసం వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు తమపై అత్యాచారం చేశారంటూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా)లోని జి.మాడుగుల మండలం వాకపల్లికి చెందిన 11 మంది గిరిజన మహిళలు కేసు పెట్టారు. బాధిత మహిళలకు అదే నెల 28వ తేదీన విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపారు. అనేక పోరాటాల అనంతరం విశాఖలో ఎస్‌సీ, ఎస్‌టీ ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. కోర్టు ఆదేశాలతో బాధిత మహిళల దుస్తులు, ఇతర వస్తువులు ఫోరెన్సిక్ విభాగానికి పంపించి, ఆధారాలు నమోదు చేశారు. ఆ తరువాత వాటిని అధికారులు గల్లంతు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా సుమారు 36 మంది సాక్షులను కోర్టు విచారించింది. కరోనా కారణంగా రెండేళ్లు విచారణ నిలిచిపోయింది. ఆ తరువాత మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో పదకొండు మంది బాధిత మహిళల్లో ఇద్దరు చనిపోయారు. 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో విశాఖపట్నం పదకొండో అదనపు జిల్లా కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. దర్యాప్తు అధికారులపై తొలినుంచీ బాధితులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయితే, న్యాయమూర్తి తన తీర్పులో దర్యాప్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. బాధిత మహిళలకు గొప్ప ఊరట లభించినట్టయింది. ‘‘అన్యాయం జరిగిందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కానీ, ఈ కేసులో విచారణ సరిగ్గా జరగలేదు. దర్యాప్తు అధికారుల తీరువల్ల ఆధారాలు లభించని కారణంగానే నిందితులను (పోలీసులను) విడిచిపెడుతున్నాం’’ అని ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగా కేసును నీరుగార్చిన విచారణ అధికారులు బి.ఆనందరావు, ఎం.శివానందరెడ్డిలను విచారించాలని ఆంధ్రప్రదేశ్ అపెక్స్ కమిటీని న్యాయమూర్తి ఆదేశించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బాధిత మహిళలకు నష్టపరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.