కుమార్తెను అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేయాల్సిన తండ్రే కసాయిగా మారాడు. ఆమెపై మృగంలా ప్రవర్తించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం ధరించడంతో చేసిన తప్పును కప్పి పుచ్చేందుకు అబార్షన్ చేయించేందుకు యత్నించాడు. అప్పటికే ఐదు నెలల గర్భవతి కావడంతో కుదరదని వైద్యులు చెప్పడంతో, మెడికల్ షాపులో మందులు కొని మింగించాడు. ఫలితంగా ఆమెకు అబార్షన్ కావడం, తల్లికి నిజం తెలియడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరంలో చోటుచేసుకుంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి.
గంరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (45). స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె (15)పై కన్నేసిన అతడు ప్లాన్ ప్రకారం చిన్న కుమార్తెను, భార్యను ఐదు నెలల క్రితం పది రోజుల పాటు బంధువుల ఇంటికి పంపించాడు. అనంతరం పెద్ద కుమార్తెకు పానీ పూరీ, నూడిల్స్‌లో మత్తు మందు కలిపి తినిపించాడు. ఆమె మత్తులోకి వెళ్లాక కోర్కె తీర్చుకునేవాడు. భార్య ఇంటి నుంచి ఏదైనా పనిపై బయటకు వెళ్లినప్పుడల్లా కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. అయితే భార్య, ఇతర కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఐదు నెలల గర్భవతిగా గుర్తించిన వైద్యులు అబార్షన్ చేసే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో గర్భం పోయేందుకు స్ధానికంగా వున్న మెడికల్ షాప్‌లో మందులను కొనుగోలు చేసి, కొన్ని రోజులుగా ఆమెతో వాడిస్తున్నాడు. దీంతో రెండు రోజుల క్రితం ఆమెకు అబార్షన్ అయి తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లి, ఇతర కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో బాలికను నిలదీశారు.
ఆమె చెప్పిన విషయం విని హతాశులయ్యారు. కన్న తండ్రే నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని చెప్పి కన్నీరు మున్నీరవడంతో ఏం చేయాలో తెలియక తల్లడిల్లారు. విషయం శుక్రవారం రాత్రి వెలుగులోకి రావడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు నిందితుడిపై దాడికి యత్నించారు. ఈ లోగా అతడు తప్పించుకుని పరారయ్యాడు. ఈ దారుణ ఘటనపై బాధిత బాలిక కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. హార్బర్ ఏసీపీ శిరీష, న్యూపోర్టు సీఐ రాము నిందితుడిని విచారిస్తున్నారు.