పాము కాటుకుగురైన ఓ బాధితురాలు చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే.. ఆమె చేతికి కట్టిన బ్యాండేజ్‌లో సర్జరీ బ్లేడ్‌ను వదిలేశారు. దీంతో బాధిత మహిళ చేతికి ఇన్‌ఫెక్షన్ సోకింది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమె పరిస్థితి విషమంగా మారిందని.. చేతిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పండిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ధారుణ ఘటన
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
ఘటన వివరాల్లోకి వెళితే.. విస్సన్నపేటకు చెందిన నందిపాము తులసి (24), సురేష్ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. గత నెల 28న తులసి పాము కాటుకు గురైంది. ఇంట్లో మంచం కింద ఉన్న వస్తువులను సర్దుతుండగా ఆమె చేతిపై పాము కాటేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే విస్సన్నపేటలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. విషం విరుగుడు కోసం ఇంజక్షన్లు ఇచ్చిన అక్కడి సిబ్బంది మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. నూజివీడు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చెయ్యి నల్లగా మారిపోయింది. దీంతో అక్కడి వైద్యుల సూచన మేరకు అదే రోజు రాత్రి తులసిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బాధితురాలిని పరీక్షించిన డాక్టర్లు ఆమె పరిస్థితి బాగానే ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదని, విషానికి విరుగుడు ఇచ్చామని భయపడాల్సిన పనిలేదని కుటుంబ సభ్యులకు చెప్పారు. రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచిన తర్వాత ఇంటికి తీసుకెళ్లిపోవచ్చునని వెల్లడించారు. చెయ్యి వాచిపోయి ఉండడం, బాధితురాలు బాధతో విలవిల్లాడుతుంటే ఎలా ఇంటికి తీసుకెళ్తామని బంధవులు ఆసుపత్రి సిబ్బందిని అడగటంతో ఆమెను పరీక్షించిన వైద్యులు ఐసీయూకు తరలించారు. చేతికి సర్జరీ చేసి అరచేతికి వెనుక వైపు వాచిపోయి ఉన్న భాగాన్ని తొలగించారు. సర్జరీ తర్వాత మోచేతి వరకూ కట్టు కట్టారు. అనంతరం ఆమెను సాధారణ వార్డుకు తరలించారు.
రెండు రోజుల తర్వాత డ్రెస్సింగ్ చేసేందుకు కట్టు విప్పి చూడగా.. దాని లోపల బ్లేడ్ కనిపించింది. బాధితురాలి బంధువులు ఇదేంటని ప్రశ్నిస్తే.. డాక్టర్లకు విషయం తెలియజేస్తామంటూ అక్కడి సిబ్బంది శుభ్రం చేసి కట్టుకట్టేసి వెళ్లిపోయారు. తనకు బ్యాండేజ్ లోపల ఏదో గుచ్చుతున్నట్టుగా ఉందంటూ బాధితురాలు తులసి చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదంటూ ఆమె భర్త సురేష్, బంధువులు ఆరోపంచారు. చేతికి ఇన్‌ఫెక్షన్ ఎక్కువైందని ఇప్పుడు తొలగించాల్సి ఉంటుందంటూ వైద్యులు చెప్పారన్నారు. తాము ఇదేమిటని నిలదీస్తే.. వెళ్లిపోయారంటూ బాధితురాలి బంధువులు ఆందోళన చేపట్టారు.
అయితే డాక్టర్ల వాదన మరోలా ఉంది. డ్రెస్సింగ్ చేసేందుకు బ్యాండేజ్‌ను విప్పే సమయంలో బ్లేడ్‌ను ఉపయోగించారని.., దాన్ని చూసి చూసి లోపల ఉంచేశారని బాధితురాలి బంధువులు పొరపాటు పడుతున్నారన్నారు. విష ప్రభావం ఉన్న చోట సర్జరీ చేశామని చేతిని తొలగించాల్సిన అవసరం లేదని అంటున్నారు.