కరుడుగట్టిన దొంగ ఆవుల అనిల్ కుమార్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇతడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా్ల్లో పలు కేసుల్లో నిందితుడని క్రైం డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. అనిల్ కుమార్‌ది పశ్చిమగోదావరి జిల్లా. ఇతడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల కాకినాడ ఎల్ బీ నగర్‌లో ఓ ఇంటి ముందు అనిల్ రెక్కి నిర్వహించినట్లు చెప్పారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు నమోదైనట్లు తెలిపారు.
అనిల్ కుమార్ పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రిళ్లు దొంగతనానికి పాల్పడుతుంటాడని డీఎస్పీ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటికి తాళం వేసి బయట ప్రాంతాలకు వెళ్లే వాళ్లు విలువైన వస్తువులను జాగ్రత్తగా దాచుకోవాలని.., సమీప బ్యాంకుల్లోని లాకర్లలో భద్రపరిస్తే మంచిదని చెబుతున్నారు. ఇరుగుపొరుగు వారికి తమ ఇంటిపై ఓ కన్నేసి ఉండమని చెప్పటంతో పాటు సమీప పోలీసు స్టేషన్‌లో ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు.
ఆవుల అనిల్ కుమార్ కదలికలపై పెద్దాపురం, కాకినాడ సబ్‌డివిజన్లలో గల ఎస్సైలు, పోలీసు సిబ్బందిని అలెర్ట్ చేసినట్లు డీఎస్పీ రాంబాబు వెళ్లడించారు. గ్రామాల్లో విలేజ్ కమిటీలు కూడా అప్రమత్తంగా ఉండి మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నిందితుడు ఆవుల అనిల్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.