ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకుని దేవస్థానంలో దొంగలు పడ్డారు. భక్తుల కోసం సిద్ధం చేసే అన్నప్రసాదం సామాగ్రి దొంగతనానికి గురికావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇందులో ఇద్దరు వంట సిబ్బంది, మరో ఇద్దరు సహాయకుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా నిత్య అన్నదానానికి ఉపయోగిస్తున్న సామాగ్రి చోరీకి గురవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆలయ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టడంతో నిర్ధారణ అయింది.
దీంతో ఆలయ ఈవో ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంటి దొంగల గుట్టును రట్టు చేశారు. ఈ తనిఖీల్లో 25 బస్తాల బియ్యం, 2 బస్తాల కందిపప్పు, 10 డబ్బాల వంట నూనె, మిరపకాయలు తదితర వంట వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈవో తనిఖీల్లో రెండు జింక చర్మాలు కూడా లభ్యం కావడం కలకలం రేపుతోంది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పనిచేస్తూ ఇలాంటి పనులు చేయడమేంటని వంట సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ కాణిపాకం ఆలయంలో చోరీ జరిగింది. కాణిపాక ఆలయం పునః నిర్మాణం పూర్తయ్యాక ఆలయ కుంభాభిషేకం రోజున స్వామి విగ్రహాన్ని అలంకరించేందుకు బంగారు విభూతి పట్టీని ఓ భక్తురాలు విరాళంగా ఇచ్చారు. వేలూరు గోల్డెన్ టెంపుల్‌కు చెందిన నారాయణి శక్తి అమ్మణ్ ఈ బంగారు విభూదిపట్టీని స్వామివారికి కానుకగా ఇచ్చారు. విభూదిపట్టీ విలువ రూ. 18 లక్షలు. ఈ విభూది పట్టీని స్వామివారి కుంభాభిషేకం సందర్భంగా గతేడాది ఆగస్టు 21 వ తేదీన స్వామివారికి అలంకరించారు. ఆ తర్వాత రోజు నుంచి అది కనిపించడం లేదు. విరాళమిచ్చిన భక్తురాలు తనకు రశీదు ఇవ్వలేదని అధికారులను సంప్రదించడంతో పట్టీ కనిపించడం లేదన్న విషయం బయట పడింది.
విభూదిపట్టీ మాయంపై భక్తురాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. విషయం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి రావడంతో దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ఆ ఆభరణం గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 45 రోజుల తర్వాత ఆలయ యాగశాలలో విభూదిపట్టీ ప్రత్యక్షమైంది. అయితే ఇన్ని రోజులు స్వామివారి వెండి విభూతి పట్టీ ఎక్కడుంది ? దాన్ని ఎవరు దొంగిలించారు ? యాగశాలకు ఎలా చేరింది ? అనే అంశంపై విచారణ జరిపారు. అయినా దొంగలేవరో తేలలేదు. ఈ క్రమంలో మరోసారి ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శించటం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది.