ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో ఇసుక తవ్వకాలపై టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం,,,టీడీపీ మాజీ ఎమ్మెల్యేను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 06:19 PM

రాజధాని అమరావతిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల  యుద్దం పెరగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలపై అధికార వైఎస్ఆర్సీపీ, టీడీపీల మధ్య సవాళ్లతో ఉత్కంఠ కొనసాగుతోంది. అభివృద్ధి విషయంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అవినీతిపై అమరరామలింగేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు సమాయత్తం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి వరకు అమరావతిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.


టీడీపీ నేతలకు 149 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. అమరావతి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఐదు మండలాల్లో 200 మంది నేతలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో అమరావతిలో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఉత్కంఠ నెలకొంది. ఎటువంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.


డీఎస్పీ ఆదినారాయణ అమరావతి పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం రాత్రి 9 వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్లు సహజమని, అవి పౌరజీవనానికి విఘాతం కలిగేలా, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరు పార్టీల నాయకులు చర్చలకు లేదా ప్రమాణానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 200 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరావతి చుట్టూ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


అమరావతిలోని లాడ్జీల్లో కొత్త వ్యక్తులకు గదులు ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని.ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. చట్టాన్ని అతిక్రమిస్తే, కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అమరావతికి వెళ్లకుండా ఇరు పార్టీల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారు. ముఖ్య నేతల ఇళ్ల వద్ద పహారా కాస్తున్న నోటీసులు ఇచ్చి, ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.  మరోవైపు, ఎమ్మెల్యే నంబూరి శంకరరావు అమరరామలింగేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోగా.. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com