తిరుమల వెంకన్నకు బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఏకంగా 250 ఎకరాల తన భూములను విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఆ భూమిలో తానే స్వయంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార ఉత్పత్తులను పండించి టీటీడీకి అప్పగించనున్నారు. ఈ క్రమంలో సైదాపురం మండలం పోతేగుంటలో ఉన్న ఆ భూములను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. బెంగళూరుకు చెందిన మురళీకృష్ణకు పోతేగుంటలో 90 ఎకరాలు, పోతేగుంటకు పక్కనే ఉన్న తిరుపతి జిల్లా డక్కిలి మండలం దగ్గవోలులో 160 ఎకరాలు కలిపి మొత్తం 250 ఎకరాల బీడు భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఆయనే స్వయంగా టీటీడీకి అవసరమైన ఆహార ఉత్పత్తులు, పూలు సాగు చేసి అప్పగించేందుకు ముందుకు వచ్చారు. దీంతో అధికారుల బృందం నీటి వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. భూముల రికార్డుల మార్పుపై రెవెన్యూ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆ భూముల మ్యాపును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దాత మురళీకృష్ణ, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజీ, నెల్లూరు ఆర్డీవో మలోలా తదితరులు పాల్గొన్నారు.