2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.10,203 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే..రోజుకు రూ.28 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు అయ్యిందని, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. ఈ లెక్కన రోజుకు రూ.43 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హౌసింగ్‌పై ఏపీ చేస్తున్న ఖర్చు కొన్ని చిన్న రాష్ట్రాల బడెట్ కన్నా అధికమని అధికారులు వివరించారు. ముగిసిన ఆర్థిక సంవత్సకంలో హౌసింగ్‌పై పెట్టిన ఖర్చును సీఎం వైయస్ జగన్‌కు అధికారులు వివరించారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇంత బడ్జెట్ లేదన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. శ్లాబ్ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధంచేసినవి.. 4,67,551 ఇళ్లు ఉన్నాయని చెప్పారు. ఇవి కొన్నిరోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. నిర్మాణాల్లో ఉపయోగించే రాయి, సిమెంటు, స్టీలు.. తదితర సామగ్రిపై పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మొత్తంగా 4529 పరీక్షలు చేశామని, 2 శాతం మేర లోపాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకున్నామన్న అధికారులు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని మరోసారి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.