ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్యూమినియం రైళ్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ

national |  Suryaa Desk  | Published : Sat, Apr 15, 2023, 08:07 PM

గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లను పరీక్షించేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక హై-స్పీడ్ టెస్ట్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తోంది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు 70 కి.మీ. దూరంలోని జోధ్‌పూర్ డివిజన్‌లో గుధా-థాథానా మిత్రి మధ్య 59 కిలోమీటర్ల పొడవైన బ్రాడ్ గేజ్ ట్రాక్ నిర్మాణం చేపట్టింది. ఎలివేటెడ్ టెస్ట్ ట్రాక్ రాబోయే సంవత్సరాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పరీక్షించడానికి కూడా ఉపయోగిపడుతుంది. ఈ ట్రాక్ పూర్తయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమగ్ర పరీక్షా సౌకర్యాలను కలిగి ఉన్న మొదటి దేశంగా భారత్ నిలుస్తుందని భారతీయ రైల్వే పేర్కొంది.


మొత్తం 59 కి.మీ. హై-స్పీడ్ రైల్వే ట్రాక్‌‌లో 23 కిలోమీటర్ల మెయిన్ లైన్.. గూడా వద్ద 13 కిలోమీటర్ల హై-స్పీడ్ లూప్, నావా వద్ద 3 కిలోమీటర్ల వేగవంతమైన టెస్టింగ్ లూప్, మిత్రి వద్ద 20 కిలోమీటర్ల కర్వ్ టెస్టింగ్ లూప్ ఉన్నాయి. వాయువ్య రైల్వే జోన్ సీపీఆర్ఓ ప్రకారం.. మొదటి దశ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతుంది. ప్రాజెక్ట్ బాగా పనులు పురోగతిలో ఉన్నాయని, డిసెంబర్ 2024 నాటికి రెండో దశను పూర్తి చేయాలని భావిస్తున్నామని తెలిపారు.


డైనమిక్ ఆసిలేషన్ ట్రయల్స్ (220 కి.మీ. వేగం వరకు), భద్రతా ప్రమాణాలను మూల్యాంకనం చేసే వాహనాల స్టాటిక్ అసెస్‌మెంట్ కోసం హై స్పీడ్ టెస్ట్ ట్రాక్ రైళ్ల సమగ్ర పరీక్షా సౌకర్యాలు, రోలింగ్ స్టాక్ కాంపోనెంట్స్ కోసం అనుమతిస్తుందని భారతీయ రైల్వే తెలిపింది. ‘రైల్-వీల్ ఇంటరాక్షన్ ఫోర్స్‌ల అధ్యయనం. క్రాష్‌వర్థినెస్ టెస్టింగ్, స్టెబిలిటీ టెస్టింగ్, ట్విస్ట్ అండ్ యావ్ టెస్టింగ్, కో-ఎఫీషియంట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వీల్ ఆఫ్‌లోడింగ్ టెస్ట్, ఎక్స్-ఫాక్టర్ టెస్ట్, బోగీ రొటేషనల్ రెసిస్టెన్స్ టెస్ట్‌లు, కాంపోనెంట్‌ల వేగవంతమైన టెస్టింగ్ అభివృద్ధి చేస్తున్నాం’ అని రైల్వే తెలిపింది.


దీంతో పాటు అదనంగా 220 కి.మీ. ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్, అన్ని రకాల సిగ్నలింగ్ సిస్టమ్‌లు టెస్ట్ ట్రాక్‌లో ఉంటాయని పేర్కొంది. ‘ట్రాక్, వంతెనలు, టీఆర్డీ పరికరాలు, సిగ్నలింగ్ గేర్, జియో-టెక్నికల్ అధ్యయనాలను నిర్వహించే సౌకర్యాలు కూడా టెస్ట్ ట్రాక్‌లో ఉంటాయి’ అని రైల్వే తెలిపింది. ‘రోలింగ్ స్టాక్ స్టాటిక్ టెస్టింగ్ కోసం 4.5 కిలోమీటర్ల ట్విస్టెడ్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది... 31.5 కిలోమీటర్ల హైస్పీడ్ స్ట్రెచ్, 3 కిలోమీటర్ల యాక్సిలరేటెడ్ టెస్టింగ్ లూప్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. డిసెంబర్ 2023 నాటికి ఇవి పూర్తవుతాయి’ అని రైల్వే వివరించింది.


ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త టెస్ట్ ట్రాక్‌లో ఆధునిక సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా తన రైళ్లను పరీక్షించడం ప్రారంభించాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ఇదిలా ఉండగా మిత్రిలో కర్వ్ టెస్టింగ్ లూప్ కోసం భూసేకరణ కీలక దశలో ఉందని, 2024 చివరి నాటికి ఈ స్ట్రెచ్ కూడా అందుబాటులోకి వస్తుందని రైల్వే తెలిపింది.


100 అల్యూమినియం వందే భారత్ రైళ్ల తయారీకి టెండర్‌ను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నందున 220 కి.మీ వేగంతో రైళ్లను పరీక్షించే ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతీయ రైల్వేలు ప్రస్తుతం స్టెయిన్‌లెస్ స్టీల్ రైళ్లను తయారు చేస్తున్నాయి. మొదటిసారిగా అల్యూమినియం రైళ్లను తయారు చేయడానికి రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రూ. 30,000 కోట్ల ప్రాజెక్ట్ కోసం ఫ్రాన్స్‌కు చెందిన ఆల్‌స్టోమ్, స్విస్ కంపెనీ స్టాడ్లర్‌ సహా మేధా సాంకేతిక బిడ్‌లను దాఖలు చేశాయి. అల్యూమినియం రైళ్లు తేలికైనవి. 200 కి.మీ. కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com