అర్థరాత్రి వ్యయాప్రయసాలు మోసి గమ్యం చేరుకొంటామని భావించాక మీ మిమానం రద్దు అంటే మీకు ఎలా అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి కోసమే ఆ విమాన ప్రయాణికులకు వచ్చింది. విమానం రద్దయినట్టు బయలుదేరాల్సిన 10 నిమిషాల ముందు ఎయిర్‌లైన్స్ ప్రకటించడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు.. రద్దయిన విషయం పది నిమిషాల ముందు చెబుతారా? అని నిలదీశారు. తమ పరిస్థితేంటని మండిపడిన ప్రయాణికులు.. ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఓ ప్రయాణికుడు.. ‘ఆయన తల పగలగొట్టండి’ అని గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బుధవారం తెల్లవారుజామున గోవా విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గో ఫస్ట్ ఎయిర్‌లైన్ విమానం షెడ్యూల్ ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.10 గంటలకు గోవా నుంచి ముంబయికి బయలుదేరాల్సి ఉంది. విమానం బయలుదేరాల్సిన సమయానికి సరిగ్గా పది నిమిషాల ముందు సర్వీసు రద్దయినట్టు గో ఫస్ట్ సిబ్బంది ప్రకటన చేశారు. అప్పటికే విమానం కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు ఈ విషయం తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడ ఉన్న సిబ్బందితో గొడవకు దిగారు.
విమానం రద్దు చేసినట్టు 10 నిమిషాల ముందు చెబుతారా? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటి? అని నిలదీశారు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం రద్దు కావడంతో 80 మందికిపైగా ప్రయాణికులు గోవా విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ‘ఆయన తల పగలగొట్టండి’ అని గో ఫస్ట్ సిబ్బందిని ఉద్దేశించి ఓ ప్రయాణికుడు కేకలు వేయడం ఓ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.
మరో విమానం ఏర్పాటు చేసేంత వరకు తమకు హోటల్ గది సౌకర్యం కల్పించాలని మరో ప్రయాణికుడు డిమాండ్ చేశాడు. కాగా, ఈ గొడవ తర్వాత ఉదయం 6.30 గంటల సమయంలో మరో విమానం ద్వారా ప్రయాణికులను గమ్య స్థానానికి తరలించారు.