ఇపుడు మనదేశంలో వందే భారత్ రైళ్ల హవా కొనసాగుతోంది. ఇదిలావుంటే త్వరలో మినీ వెర్షన్ వందే భారత్ రైళ్లు రానున్నాయి. 100 కి.మీ. దూరంలోని నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ కోసం ‘వందే మెట్రో’ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రధాన నరగాల మధ్య కనెక్టివిటీని పెంచుతూ అత్యాధునిక వసతులతో వేగవంతమైన రైళ్లు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా వీటిని 500 కి.మీ. దూరం ఉన్న నగరాల మధ్య ప్రవేశపెడుతున్నారు. ఇలాంటి నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా వీటిని ప్రవేశపెట్టారు. ఇక సమీప నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో వందే మెట్రోలను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాదు, ఇలాంటి రైళ్లు రోజుకు 4, 5 ట్రిప్పులు సేవలు అందించనున్నాయి.
పెద్ద నగరాల నుంచి సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వందే మెట్రో రైళ్లను నడపనున్నారు. తద్వారా లోకల్ రైళ్లలో రద్దీ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మినీ వెర్షన్ ‘వందే మెట్రో’లపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. గురువారం (ఏప్రిల్ 13) ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి వందే మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామంటూ ఆయన శుభవార్త చెప్పారు.