యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం మారెళ్ల సమీపంలో బీసీ సంఘాల ప్రతినిధులతో టీడీపీ యువ నేత నారా లోకేశ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ హాస్టళ్లలో సక్రమంగా భోజనాలు అందించడం లేదని ఓ మహిళా ప్రతినిధి తెలపగా స్పందించిన లోకేశ్ టీడీపీ అధికారంలోకి రాగానే నాణ్యమైన ఆహారం అందిస్తామని చెప్పారు. బీసీ ఉప కులాల దామాషా ప్రకారం బీసీ విద్యార్థుల కాలేజీ హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లాభసాటి వ్యవసాయంపై ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. పత్తికొండ, ఆలూరు ప్రాంతాల్లో టమోటా కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యాన పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.