సీఎం జగన్ ఈ నెల 19న మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా మూలపేట, నౌపడలో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ ఆదివారం పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపు, వీవీఐపీ వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్, ప్రొటోకాల్ నిర్వహణ తదితర అంశాలపై ఎస్పీ జీఆర్ రాధికను అడిగి తెలుసుకున్నారు. విష్ణుచక్రంలో ఏర్పాటు చేస్తున్న పైలాన్, నిర్వాసితులతో సీఎం సమావేశ ప్రాంగణం, మూలపేటలో హెలీప్యాడ్‌ను, నౌపడలో సభా ప్రాంగణాన్ని డీఐజీ పరిశీలించారు. ప్రజలు ఒక్కసారిగా హెలీప్యాడ్ వద్దకు చేరుకోకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ విఠలేశ్వరరావు, కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.