వివేకా హత్య కేసు తప్పుదోవలో వెళుతోందని సుప్రీం చెప్పిందని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. విచారణ అధికారిగా రాంసింగ్ ను తప్పించినా కేసు అదే దారిలో వెళుతోందని విమర్శించారు. హత్య జరిగిన తర్వాత మిస్ అయిన పేపర్లు ఏమయ్యాయని పేర్ని నాని ప్రశ్నించారు. ఇలాంటివే అనేక అనుమానాలు ఉన్నప్పటికీ, సీబీఐ వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదని అన్నారు.
ఈ సందర్భంగా పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రస్తావిస్తూ పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. "చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ పై హత్యాయత్నం జరిగింది. ఘటన జరిగిన గంటకే చంద్రబాబు, డీజీపీ ప్రకటనలు చేశారంటే ఆ కేసు ఎలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు. వివేకా కేసు కూడా మొదట్లోనే తప్పుదారి పట్టింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు ఏమార్చలేని రంగం ఏదైనా ఉందా? చంద్రబాబు నిజాలు చెబితే తల వేయి ముక్కలవుతుందని శాపం ఉంది... అందుకే చంద్రబాబు ఎప్పుడూ నిజాలు చెప్పరు" అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.