జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పై ఏపీ మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేర్నినానికి పిచ్చి బాగా ముదిరిందని... అజ్ఞానం ఎక్కువైందని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను గుడ్డిగా చదివారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో ముందు తెలుసుకో నాని అని హితవుపలికారు. ప్రజలను కించ పరచవద్దని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో చెప్పారని... నాయకులు తప్పుగా మాట్లాడితే పవన్ ఖండించారన్నారు. వైసీపీ నాయకులు తెలంగాణ ప్రజలను కించ పరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నాయకులు మాట్లాడే వాటిని వక్రీకరించారు.. మరి మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడిన మాటలు పాలేరు పేర్ని నానికి వినపడలేదా అని నిలదీశారు. హరీష్ రావు మాట్లాడిన మాటలకు జగన్‌కు, మంత్రులకు పౌరుషం రావడంలేదా అని అన్నారు. ఏపీలో అవకాశాలు లేవని చెబితే జగన్ కు సిగ్గు అనిపించడం లేదా అంటూ మండిపడ్డారు.