టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలోని దేవనకొండలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా స్థానిక నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ... నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నులు విపరీతంగా పెంచారన్నారు. చెత్త పన్ను కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. వారికీ నారా లోకేష్ బదులిస్తూ .. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామన్నారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ చెరువు ఒకప్పుడు ఎండిపోయి ఉండేదని నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హంద్రీ నీవా జలాలతో చెరువును లింక్ చేశామన్నారు. దీని వల్ల దేవనకొండ పట్టణానికి తాగునీరు సహా పల్లెదొడ్డి, గెద్దరాళ్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు పుష్కలంగా నీరు అందుతున్నాయన్నారు.