ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థిక సమస్యలతో ప్రేమ జంట ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 20, 2023, 02:11 PM

కడప జిల్లా, చెన్నూరు మండలం రామనపల్లె లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే.... రామనపల్లెకు చెందిన సాయికుమార్‌రెడ్డి(26) కడపలో వాటర్‌బాటిళ్ల డిస్ట్రిబ్యూటరుగా ఉన్నాడు. చిన్నప్పుడే ఇతని తండ్రి చనిపోవడంతో తల్లి వరలక్ష్మితో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా కడపలోని దుర్గమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం కడప ఎన్జీవో కాలనీకి చెందిన హేమమాలిని(24)తో ప్రేమలో పడ్డాడు. ఎనిమిది నెలల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. అయితే సాయికుమార్‌ అప్పులు ఎక్కువ కావడంతో ఆర్థిక సమస్యలతో బాధపడుతుండేవాడు. హేమమాలిని కూడా ఓ ఫైనాన్స్‌ సంస్థలో పనిచేస్తుండేది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆ జంట మంగళవారం రాత్రి కడప శివారులోని కనుమలోపల్లె వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతదేహాలను బుధవారం గుర్తించారు. మృతురాలు హేమమాలిని ఏడు నెలల గర్భవతి కావడంతో ఆ కుటుంబం బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా.. దంపతులు ఆర్థిక సమస్యలతో మరణించారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నట్లు ఎస్‌ఐ రారాజు తెలిపారు. సాయికుమార్‌రెడ్డిని ఓ స్థల విషయమై ఒక వర్గం వారు ఇబ్బంది పెట్టడం, ఆర్థిక సమస్యల కారణంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com