కుప్పం మండలం వి.మిట్టపల్లెలో బుధవారం ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ విందులో ఎంపీపీ అశ్విని పాల్గొనడం వివాదంగా మారింది. మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్న ఫొటో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఒక మహిళగా మసీదులో ఎంపీపీ అశ్విని పాల్గొనడం మత విశ్వాసాలకు విరుద్ధమంటూ పలువురు ముస్లిం నేతలు పేర్కొంటున్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం ఇలా మహిళలకు మసీదులో ప్రవేశం కల్పించడం ఏమిటని టీడీపీ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ‘ముస్లింల ఆచార వ్యవహారాలు తెలియకుండా మసీదులోకి వెళ్లడం ఆమె తప్పుకాదు. అయితే, ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా ఒక మహిళ వెళ్లి మగవారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఏమాత్రం సమంజసం కాదు. ఈమె ఒకరు తప్ప ఇతర మహిళలెవరూ లేరు. ముస్లిం సోదరులతో కలిసి ఈమె కూర్చోవడం ఖండించదగ్గ విషయం’ అని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న అశ్విని.. ఇలా ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా మసీదులోకి వెళ్లి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సరికాదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా అన్నారు. దేశంలోని ముస్లింలకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.