కర్నూలు , నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని వాసవి నగర్లో వైసీపీ నాయకులు మల్లు వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో జరుగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గత రెండు నెలల నుంచి మల్లు వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో పేకాట జరుగుతున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు పకడ్బందీగా వ్యూహం పన్ని డ్రస్‌లు మార్చి వెల్డింగ్ పని చేసే వారి మాదిరిగా ఆ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతంలో మకాం వేశారు. మధ్యాహ్నం తర్వాత సుమారు 13 మంది ఆ ఇంటికి చేరుకుని మూడో అంతస్థులోకి వెళ్లి పేకాట మొదలు పెట్టారు. దీంతో సీఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఒక్కసారిగా దాడులు చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 13 మందిలో ఓ ప్రముఖ న్యాయవాది కూడా ఉన్నారు. అలాగే పంచాయతీ రాజ్ డీఈ సుధాకర్‌గౌడు, ఓ టీచర్ కూడా ఉండటం విశేషం. పేకాట శిబిరం నిర్వహిస్తున్న మల్లు వెంకటేశ్వరరెడ్డి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడుగా ఉన్నారు. ఆయన తమ్ముడు నందికొట్కూరు ఎంపీపీ కూడా. పోలీసులు 13 మందిని స్టేషన్‌కు తరలించారు.