కడపలోని గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలకు వైసీపీ నాయకులు తాళాలు వేసి వీరంగం సృష్టించారు. ఈ కళాశాల ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి కొద్దిరోజులుగా ఇరుపక్షాల మధ్య వివాదం నడుస్తుండడంతో.. శుక్రవారం సుమారు వందమంది వచ్చి కాలేజీ గేటుకు తాళాలు వేశారు. కళాశాల కరస్పాండెంట్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి తాళాలు తెరిపించారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రాం పవన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సీఎం జగన్‌బంధువు, ఆర్టీసీ చైౖర్మన్ మల్లికార్జునరెడ్డి సోదరుడు అయిన వల్లూరు మండల మాజీ జడ్పీటీసీ సభ్యుడు వీరారెడ్డి, ఐడీబీఐ మాజీ మేనేజరు సుధాకర్‌రెడ్డి అనుచరులు దాదాపు వంద మంది శుక్రవారం ఉదయం 7:30 గంటలకు కళాశాల వద్దకు వచ్చి చుట్టుముట్టారు. ఆవరణలోకి ప్రవేశించి గేటుకు తాళం వేశారు. దీంతో డిప్లమా, ఇంజనీరింగ్ విద్యార్థులు రెండన్నర గంటల పాటు బయటే ఉండిపోయారు. మహిళా ఫ్యాకల్టీ కూడా ఇబ్బందులు పడ్డారు. చెన్నూరు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి అక్కడకు చేరుకుని 10.30 గంటల ప్రాంతంలో ప్రధాన గేటు తాళాలు తెరిపించారు. అనంతరం కరస్పాండెంట్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా.. కళాశాల ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ఇరుపక్షాల మధ్య వివాదం నడుస్తోందని, దీంతో వైసీపీ నేతలు మందీమార్బలంతో వెళ్లి కళాశాల గేటుకు తాళం వేశారని అంటున్నారు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు.