మదనపల్లె పట్టణంలోని ఆయా కాలనీలు, ప్రాంతాల్లో దొంగల ముఠా తిరుగుతోంది. తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చోరీలు చేస్తున్నారు. తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువా తలుపులు, లాకర్లు ధ్వంసం చేస్తున్నారు. అదే విధంగా ఇనుప పెట్టెలు, కప్‌బోర్డులు ధ్వంసం చేసి అందులో ఉన్న విలువైన సొత్తు చోరీ చేస్తున్నారు. స్థానికులు కనుగొని బాధితులకు సమాచారం ఇస్తుండడంతో చోరీ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వేసవి సెలవులకు ఇంటిల్లిపాది బంధువుల ఊళ్లకు, స్వగ్రామాలకు వెళ్తుండడంతో చోరీలు జరిగే అవకాశం ఉంది. గతంలో పలు చోరీ కేసుల్లో పాతికేళ్ల లోపు యువకులు పట్టుబడ్డారు. జల్సాలు, విలాసాలకు అలవాటుపడి చేతిలో డబ్బుల్లేక చోరీలను వృత్తిగా ఎం చుకుని నేరాలకు పాల్పడుతున్నారు. కాలనీల్లో సంచరి స్తూ బాడుగ ఇల్లు కావాలని, తెలిసిన వ్యక్తుల పేరు, చిరునామా, ఇతర వివరాలు అడుగుతున్నట్లు నటించి తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తున్నారు. ఈ రకంగా ఇళ్లను టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించి చోరీలు చేస్తున్నారు. ప్రధా న రహదారులు, జంక్షన్లు, ఏరియాల్లో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నా.. ఫలితం శూన్యం. యథాప్రకారం చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వేసవిలో జరిగే చోరీల పై కాలనీల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా.. జనాల్లో మార్పు రావడం లేదు. ఇళ్లకు తాళం వేసుకుని రోజుల తరబడి ఊళ్లల్లో ఉండడంతో దొంగలకు చోరీలు చేయడం సులువైపోయింది.