కరోనా మళ్లీ కేరళపైనే దాడిచేస్తోంది. ఇదిలావుంటే దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మరోసారి 12 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోల్చితే ఇవి 4 శాతం అధికం. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,193 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,42,83,021కి చేరింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి దేశంలో 1,97,477 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 6.19 శాతానికి చేరుకోగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 5.29 శాతంగా ఉంది. కోలుకున్నవారి కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 67,556 (0.15శాతం)గా ఉన్నాయి.
అటు, కరోనా మరణాలు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. దేశంలో గడచిన 24 గంటల్లో కరోనాతో మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా కేరళలో 10 మంది చనిపోయారు.. అవి సవరించిన గణాంకాలుగా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనాకు 5,31,300 మంది బలయ్యారు. దేశంలో మరో 10,765 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ‘కోవిడ్-19 మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు.. వైరస్ కట్టడి విషయంలో అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. అంతేకాదు, ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. పెద్ద సంఖ్యలో కేసుల వెలుగుచూడటం స్థానికంగా వైరస్ వ్యాప్తిని సూచిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రారంభ దశలోనే దీన్ని నియంత్రించేందుకు అవసరమైన ప్రజారోగ్య చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.