జమ్మూ కశ్మీర్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడి వెనుక భారీ కుట్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పూంజ్ జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఐదుగురు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక జీ-20 కూటమి అధ్యక్ష హోదాలో ఉన్న భారత్.. దీనికి సంబంధించిన కొన్ని సదస్సులను శ్రీనగర్‌లో నిర్వహించాలని ఇటీవల నిర్ణయించింది. దీని ద్వారా ఆర్టికల్-370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని ప్రపంచానికి తెలియజెప్పాలని భావించింది. భారత్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఉగ్రవాదులు తాజా ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే ఈ దాడికి బాధ్యతవహిస్తూ పీపుల్స్ యాంటీ ఫాసిస్టు ఫోర్స్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటన చేసింది. పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ (జేఈఎం)కు ఇది అనుబంధ సంస్థ. వచ్చే నెల గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరు కానున్నట్లు ప్రకటించని విషయం తెలిసిందే. భారత్, పాక్ ద్వైపాక్షిక సమావేశానికి అవకాశాలున్న కీలక సమయంలో పూంచ్ దాడి చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.
మరోవైపు, పూంచ్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం దట్టమైన బాటా-డోరియా అటవీ ప్రాంతంలో డ్రోన్లు, జాగిలాలతోపాటు ఓ ఎంఐ హెలికాప్టర్‌ను రంగంలోకి దింపాయి. ఈ ఆపరేషన్‌లో స్నిప్పర్ డాగ్స్, బాంబు నిర్వీర్యక దళం, ప్రత్యేక ఆపరేషన్ బృందం పాల్గొన్నాయి. పూంచ్‌తోపాటు రాజౌరీ జిల్లాలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్‌ఐఏ బృందం సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించింది. ఇప్పటివరకు 12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్, అడిషనల్ డీజీపీ ముకేశ్ సింగ్‌లు పూంజ్ పక్క జిల్లా రాజౌరీలో పర్యటించారు. పూంచ్ దాడిలో దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొని, మూడువైపుల నుంచి వీరు దాడిచేసినట్టు ఆర్మీ భావిస్తోంది. భింబర్ గలీ నుంచి సాంగియోట్‌కు వెళుతున్న సైనిక వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి, ఆపై గ్రనేడ్లు విసిరారు. దీంతో వాహనం అగ్నికీలల్లో చిక్కుకొని ఐదుగురు జవాన్లు అమరులయ్యారు.
చైనాలో తయారైన 7.62 ఎంఎం స్టీల్ కోర్ బుల్లెట్లను ఈ దాడిలో ఉగ్రవాదులు వాడినట్లు తెలుస్తోంది. అందుకు ఆధారాలను ఘటనాస్థలంలో బలగాలు స్వాధీనం చేసుకొన్నాయి. వ్యూహాన్ని అమలు చేసిన వారు రాజౌరీ, పూంచ్‌లలో ఒక సంవత్సరానికి పైగా ఉన్నారని.. చాలా కఠినమైన భూభాగంపై వారికి తగిన అవగాహన ఉందని అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్ గజ్నవీ ఫోర్స్ (JKGF) కమాండర్ రఫీక్ అహ్మద్ అలియాస్ రఫీక్ నయీకి ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉంది. అతను ఈ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం రాజౌరీ, పూంచ్ ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు ఉగ్రవాద గ్రూపులు చురుకుగా పనిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.