ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కుమారుడు, అల్లుడు ఆస్తులపై ,,,ట్విట్టర్‌లో ఆడియో షేర్ చేసిన బీజేపీ అధ్యక్షుడు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 23, 2023, 10:27 PM

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబ ఆస్తులపై ఆయన క్యాబినెట్‌లోని మంత్రి బయటపెట్టిన రహస్యాలు అంటూ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓ ఆడియో క్లిప్‌ను ట్విట్టర్ షేర్ చేయడంతో తమిళనాట రాజకీయ దుమారం రేగుతోంది. సోషల్ మీడియాలో ఈ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో తమిళనాడు ఆర్ధిక మంత్రి పలనివేల్ త్యాగరాజన్ స్పందించారు. సీఎం ఎంకే స్టాలిన్ కుటుంబం ఆస్తులపై తాను కామెంట్ చేశానంటూ బీజేపీ చీఫ్ షేర్ చేసిన ఆడియో క్లిప్‌లు నకిలీవని ఆయన పేర్కొన్నారు.


ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి, ఆయన అల్లుడు శబరీసన్ ఆస్తుల గురించి మంత్రి పీటీఆర్ కొన్ని రహస్య విషయాలను వెల్లడించాడని ట్వీట్ చేసిన బీజేపీ చీఫ్ కే అన్నమలై.. అందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ను దానికి జతచేశారు. ఈ ఆడియో క్లిప్ నకిలీదని, కుట్రపూరితంగా టెక్నాలజీ సహాయంతో తయారు చేశారని మంత్రి త్యాగరాజన్ వెల్లడించారు. ఆడియో క్లిప్‌నకు సంబంధించిన ఫోరెన్సిక్ అనాలిసిస్ స్క్రీన్ షాట్లనూ మంత్రి ట్విట్టర్‌లో ఉంచారు.


తాను భావ ప్రకటన స్వేచ్ఛకు విలువనిచ్చే వ్యక్తినని, గతంలో అనేక ఆరోపణలకు తాను స్పందించలేదనీ వ్యాఖ్యానించారు. కానీ, ఈ సారి తాను స్పందించడం తప్పలేదని, అందుకు బలవంతపెట్టే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే సాంకేతిక విశ్లేషణతో కూడా ఈ ఆడియో క్లిప్ నకిలీదని చెప్పవచ్చని తమిళనాడు మంత్రి వివరించారు. ఇది వాస్తవంగా ధ్రువీకరించని ఆడియో క్లిప్ కాదని తేలిపోతుందని స్పష్టం చేశారు. ‘ప్రజా జీవితంలో స్టాలిన్ చేసిన ప్రతి పని ఎంతో ముఖ్యమైంది.. మమ్మల్ని విభజించే ద్వేషపూరిత ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావు’ అని మంత్రి అన్నారు.


ఇదిలావుంటే ఈ ట్వీట్‌కు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై స్పందించారు. ఆ ఆడియో క్లిప్ శాంపిల్ అనాలిసిస్ డీఎంకేనే చేసిందని వివరించారు. అంతేకానీ, ఏ స్వతంత్ర ఏజెన్సీతో విశ్లేషించలేదని పేర్కొన్నారు. ఒక స్వతంత్ర ఏజెన్సీకి ఆ ఆడియో క్లిప్ ఇచ్చి పరీక్షించే ధైర్యం డీఎంకే మంత్రికి ఉందా? అని సవాల్ చేశారు. మంత్రి ఆడియో అని చెబుతూ బీజేపీ చేసిన ఆడియో క్లిప్ రాజకీయ వర్గాలను కుదిపేశాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com