ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బింద్రన్‌వాలా గ్రామంలోని గురుద్వారాలో అమృత్ పాల్‌,,పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చి లొంగుబాటు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 23, 2023, 10:28 PM

పంజాబ్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అమృత్ పాల్‌ సింగ్‌ స్వయంగా లొంగిపోయాడు. మార్చి 18న చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలీస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్‌ సింగ్‌ కోసం పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 37 రోజుల పాటు పోలీసుల కంటబడకుండా తప్పించుకున్న అమృత్ పాల్‌ సింగ్‌.. చివరకూ ఆదివారం ఉదయం మోగా వద్ద లొంగిపోయాడు. ఖలీస్థానీ వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపిన జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలా స్వగ్రామంలోనే అతడు లొంగిపోవడం గమనార్హం. శనివారం రాత్రి అక్కడకు చేరుకున్న అమృత్ పాల్‌.. పోలీసులకు అతడే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా అతడ్ని అసోంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.


మోగా జిల్లాలోని రోడె గ్రామంలోని ఓ గురుద్వారాలో అమృత్‌పాల్‌ ప్రసంగించినట్లు అధికారులు గుర్తించారు. అందులో ఇది ఏమాత్రం ముగింపు కాదని అతడు వ్యాఖ్యానించాడు. కోర్టుల దృష్టిలో తాను దోషిని కావచ్చు కానీ, దేవుడు దృష్టిలో నిర్దోషిని అని అన్నట్టు తెలుస్తోంది. ఏడాది కిందట వరకూ ఓ అనామకుడిగా ఉన్న అమృత్ పాల్‌ సింగ్.. వారిస్ పంజాబ్ దే చీఫ్, నటుడు దీప్ సిద్ధూ మరణంతో వెలుగులోకి వచ్చాడు. తనను తాను ఆ సంస్థకు చీఫ్‌గా ప్రకటించుకుని, ఉద్వేగపూరిత ప్రసంగాలతో యువతను ఆకర్షించాడు.


అమృత్ పాల్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ అనుచరులు పెద్ద సంఖ్యలో ఫిబ్రవరి 24న అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై కేసు నమోదైంది. అప్పటి నుంచి అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో మార్చి 18న జలంధర్ జిల్లాలో ఓ కార్యక్రమానికి అతడు హాజరవుతున్నట్టు తెలుసుకుని పోలీసులు చుట్టుముట్టారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా 100 కార్లతో పోలీసులు వెంబడించారు. కానీ, త్రుటిలో తప్పించుకున్న అమృత్‌పాల్‌.. తన సన్నిహితుడు పపల్‌ప్రీత్‌తో కలిసి బైక్‌పై పరరాయ్యాడు. మరోసారి మార్చి 28న హోషియోర్‌పూర్‌లోనూ ఇద్దర్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు.


అమృత్‌పాల్‌‌కు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతడు వేషాలు మార్చినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లు, ఫోటోల్లో బయటపడింది. పరారీలో ఉన్నప్పుడు అమృత్‌పాల్‌‌కు చెందిన రెండు వీడియోలు, ఓ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను పరారీలో లేని, త్వరలోనే ముందుకొస్తానని ఓ వీడియోలో ఖలీస్థానీ సానుభూతిపరుడు చెప్పారు.


హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లలో అతని రహస్య స్థావరాలను శోధించారు. అమృతపాల్ సింగ్ ఆచూకీ గురించి విశ్వసనీయ సమాచారం అందజేసే వారికి తగిన బహుమతి ఇస్తామని పలు రైల్వే స్టేషన్లలో వాంటెడ్ పోస్టర్లు అతికించారు. ఏప్రిల్ 15న ఫతేఘర్ సాహిబ్‌లోని సిర్హింద్‌లో అమృతపాల్ సన్నిహితుడు జోగా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అమృతపాల్‌తో ప్రత్యక్ష సంబంధాలున్న జోగా సింగ్... పిలిభిత్‌లో అతడికి ఆశ్రయం, వాహనాలను కూడా ఏర్పాటు చేశాడు. మార్చి 28న అమృతపాల్‌, అతడి కుడిభుజం పపల్‌ప్రీత్‌ని తిరిగి పంజాబ్‌కు జోగా సింగ్ తీసుకువచ్చాడు.


అమృతపాల్ సహాయకులలో ఎనిమిది మంది దల్జిత్ సింగ్ కల్సి, పపల్‌ప్రీత్ సింగ్, కుల్వంత్ సింగ్ ధాలివాల్, వరిందర్ సింగ్ జోహల్, గుర్మీత్ సింగ్ బుక్కన్‌వాలా, హర్జిత్ సింగ్, భగవంత్ సింగ్, గురిందర్‌పాల్ సింగ్ ఔజ్లా‌లను జాతీయ భద్రత చట్టం కింద అరెస్ట్ చేసి దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు. 37 రోజుల పాటు పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్ మోగాలోని గురుద్వారా వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత చివరకు లొంగిపోయాడు. శాంతిభద్రతలు కాపాడాలని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని పంజాబ్ పోలీసులు ప్రజలను కోరారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com