ఏఐని అదుపుచేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏఐ వస్తే మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమోననే భయం తనకు ఉందని అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండకుండా ఏఐని కట్టడి చేయాల్సి ఉందని అన్నారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్డ్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశాన్ని, మాతృభాషను, చదువుకున్న విద్యా సంస్థను, గురువులను మరిచిపోకూడదని అన్నారు. మన కట్టు, బొట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. యువత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. మన పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయాలని భావితరాలకు అందించాలని వ్యాఖ్యానించారు.భారత్ విశ్వగురువు అయినప్పటికీ ఏ దేశం మీదా దండయాత్ర చేయలేదని గుర్తు చేశారు. భారత్ సత్తాను ప్రపంచ వేదికల మీద మన వారు చాటుతున్నారని ప్రశంసించారు. కులం కంటే గుణం మిన్న అనే విషయాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. డిగ్రీల కంటే పరిజ్ఞానం ముఖ్యమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.భవిష్యత్తులో చాలా రంగాల్లో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో నాయకులు బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారని, గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన వారు ఓడిపోయారని వెల్లడించారు. సమాజం కూడా అలాంటి వాళ్లను బహిష్కరించాలని హితవు పలికారు. రామాయణాన్ని అన్ని పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని అన్నారు.తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దలు తమ పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించాలని వెంకయ్యనాయుడు సూచించారు. విద్యార్థులు, యువత ప్రతి దానికి గూగుల్ మీద ఆధారపడుతున్నారని, కానీ వారు దీనిని పక్కన పెట్టి బుర్రకు పని చెప్పాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa