వైసీపీ ప్రభుత్వం ముస్లీంలపై కక్ష కట్టిందని, ఇమాం మౌజన్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనం చెల్లించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మైనార్టీల సమస్యలపై సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ రూపొందించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం మొగల్రాజపురంలోని ఆయన నివాసంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బొండా ఉమా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఇమాంలకు, మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించడం లేదన్నారు. రంజాన్ మాసంలో మసీదుల మరమ్మతుల కోసం విడుదల చేసే నిధులు కూడా విడుదల చేయలేదని, ఇదేనా మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మౌజన్లకు 1వ తేదీనే వేతనం అందిచేదని, జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి మౌజన్లు గౌరవ వేతనం కోసం ఎదురుచూపులు తప్పడం లేదని పేర్కోన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటున్నారన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పధకాలను పునరుద్ధరిస్తామని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు అన్వర్, గౌస్, బాషా, లబ్బా వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.