టీడీపీ పార్టీ వ్యవస్థాపికుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ....ఎన్టీఆర్ యుగపురుషుడైతే.. చంద్రబాబు విజనరీ అని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కొనియాడారు. చంద్రబాబు రూపొందించిన విజన్-2047 ప్రణాళిక అమలైతే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్పారు. దివంగత ఎన్టీఆర్‌తో తన అనుభవాలు.. అనుబంధం.. చంద్రబాబుతో స్నేహం గురించి వివరించారు. ‘ఈ సభను చూస్తుంటే రాజకీయాలు మాట్లాడాలని నా బుద్ధి చెబుతోంది.. కానీ నా అనుభవమేమో ‘వద్దురా రజనీ.. జాగ్రత్త’ అని హెచ్చరిస్తోంది. అయినా నా ఆప్తమిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబునాయుడు ఇక్కడ ఉన్నప్పుడు కొద్దిగానైనా ఆయన గురించి, రాజకీయాల గురించి మాట్లాడకపోతే నాగరికం అనిపించుకోదు’ అని తెలిపారు. చంద్రబాబు 30 ఏళ్ల నుంచి తనకు మిత్రుడని.. మోహన్‌బాబు పరిచయం చేశారని చెప్పారు. అప్పటి నుంచి హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా చంద్రబాబును కలిసి మాట్లాడేవాడినని.. దాంతో తన అవగాహన పెరిగిందన్నారు.