ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి, తండ్రి, నానమ్మ చితికి నిప్పంటించిన 8 నెలల చిన్నారి.

national |  Suryaa Desk  | Published : Tue, May 02, 2023, 09:41 PM

తన అత్త చేతుల్లో ఉన్న 8 నెలల ఈ పసివాడు.. తన తల్లిదండ్రులు, నానమ్మ చితికి నిప్పు పెట్టాడు. లూథియానా గ్యాస్ దుర్ఘటనలో కుటుంబంలో ఈ బాలుడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ముందు రోజు ఉదయం తన కుటుంబాన్ని కోల్పోయిన విషాదం గురించి ఆ బాలుడికి ఎలాంటి అవగాహన లేదు. లూథియానాలోని గియాస్‌పురా ప్రాంతంలో ఆదివారం (ఏప్రిల్ 30) ఉదయం 7.30 గంటల సమయంలో విషపూరిత గ్యాస్ లీకైంది. ఊపిరాడక 11 మంది మృతి చెందారు. 8 నెలల ఈ బాలుడు తన తల్లి, తండ్రి, నానమ్మను కోల్పోయాడు. ఈ ఘటనలో బాలుడు కూడా అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాడు.


కుటుంబసభ్యులందరినీ కోల్పోయి అనాథగా మారిన ఈ బాలుడు ప్రస్తుతం తన మేనత్త ఒడిలో ఉన్నాడు. తల్లిదండ్రులు, నాయనమ్మ వారసత్వాన్ని చెరిపేయకుండా, అతడిని పెంచడం ఎలా అనే ప్రశ్న ఇప్పుడు ఆమె మెదడును తొలచివేస్తోంది. ‘బాలుడికి బాటిల్ పాలు పట్టించాం. ఆ తర్వాత పెద్దగా ఏడవలేదు. ప్రస్తుతం అతడు కాస్త జ్వరంతో ఉన్నాడు. దాని కోసం మెడిసిన్ వాడుతున్నాం. అతడి భవిష్యత్తు గురించి తలచుకుంటూనే చాలా బాధగా ఉంది. అతడి తల్లిదండ్రులకు మూడేళ్ల కిందటే పెళ్లి జరిగింది’ అని ఆమె (మేనత్త) చెప్పారు.


బాలుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడి తల్లిదండ్రుల మూలాలు ఉత్తర ప్రదేశ్‌లో ఉన్నాయి. చాలా ఏళ్ల కిందటే లూథియానాకు వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. బాలుడి మేనత్త కూడా అక్కడికి సమీపంలోనే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం బాలుడిని ఆమె వద్దే ఉంచాలని పెద్దలు నిర్ణయించారు.


బాలుడి పెదనాన్న (50 ఏళ్లు) కూడా ఈ విపత్తు నుంచి బయటపడ్డారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మాత్రమే.. ఆయనకు తన కుటుంబంలో ముగ్గురు మరణించారనే విషయం తెలిసింది. విషవాయువు పీల్చడంతో కుప్పకూలిన తనను కాపాడేందుకు వచ్చి.. ఆ ముగ్గురూ మృత్యువాతపడ్డారు. అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చిన ఆయన.. ఆ రోజు ఉదయం ఏం జరిగిందో ఒక్కొక్కటీ గుర్తు చేసుకుంటున్నారు.


బాలుడి పెదనాన్న ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో తన కుటుంబం నడుపుతున్న కిరాణా దుకాణంలో ఓ మహిళ కస్టమర్‌ అడిగిన సరకులు ఇస్తున్నారు. ఇంతలో హానికరమైన విషవాయువు దుర్వాసన అకస్మాత్తుగా తాకినట్లు ఆయన గుర్తుచేసుకున్నాడు. ‘ఆ మహిళ (కస్టమర్) తన ముఖం చుట్టూ దుపట్టా చుట్టుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. నేను కొంచెం మంచి నీళ్లు తాగాను. పక్కనే ఉన్న మెట్లు ఎక్కి ఇంటి పైకి చేరేందుకు ప్రయత్నించాను. మధ్యలోనే కుప్పకూలిపోయాను’ అని ఆయన చెప్పుకొచ్చారు.


స్పృహ కోల్పోయే ముందు చివరిసారిగా జరిగిన ఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘పైకి ఎత్తు.. ముఖంపై నీళ్లు చల్లు’ అనే అరుపులు ఆయన మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన తమ్ముడు, మరదలితో పాటు ఆయన తల్లి ఆయనకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో అతడికి తెలియదు. విష వాయువుకు ఆ ముగ్గురూ బలయ్యారు. వారితో పాటు మరో 8 మంది కూడా మృతి చెందారు. అక్కడికి సమీపంలో ఉన్న పాల ఉత్పత్తులను సంబంధించిన ఓ ఫ్యాక్టరీ నుంచి ఆ గ్యాస్ లీక్ అయినట్లు తెలిసింది. ఆ విషవాయువు కారణంగా ఫ్యాక్టరీ సమీపంలో నివసిస్తున్న పలువురు.. శ్వాస తీసుకోవటానికి ఇబ్బందులు ఎదుర్కొని మృతి చెందారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


బాలుడి తండ్రి తన సోదరుడిని కాపాడటానికి ముందు తన చేతుల్లో ఉన్న బిడ్డను బంధువు అయిన ఓ వ్యక్తికి అప్పగించారు. ఆ తర్వాత ఆ బిడ్డ కూడా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స తర్వాత కోలుకుంటున్నాడు. తల్లిదండ్రులు, నానమ్మ అంత్యక్రియలు చేసేందుకు మేనత్తతో కలిసి వచ్చాడు.‘నా తమ్ముడు తన బిడ్డకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందించాలని కోరుకున్నాడు. అతడిని పోలీసు అధికారిని చేయాలని కలలు కన్నాడు. ఆ కలను నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను. ఉత్తమమైన విద్యను అందజేస్తాను’ అని బాలుడి పెదనాన్న చెబుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa