కర్ణాటక ఎన్నికలు దేశంలో హీటు పెంచుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ భజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడంపై మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హోంమంత్రి తదితరులు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. కమల్ నాథ్ హనుమంతుని భక్తిని బీజేపీ నేతలు ప్రశ్నించగా.. ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారు చర్యను ఎదుర్కోవాలని కమల్ నాథ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఏ స్థాయికైనా వెళ్తున్నట్లుగా ఉందని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా బుధవారం కమల్ నాథ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భజరంగ్‌దళ్ ను స్థిరమైన జాతీయవాద సంస్థ అని పేర్కొన్నారు హోంమంత్రి. 'కమల్‌నాథ్‌కి లేఖ రాశాను. హనుమంతుని భక్తునిగా చెప్పుకుంటూ ఆయన చేసిన చాలా ట్వీట్లు చూశాను. కాంగ్రెస్ భజరంగ్‌దళ్ ను పిఎఫ్‌ఐతో సమానం చేసింది. కమల్ నాథ్ తన వైఖరిని స్పష్టం చేయాలి. ఇదే కాంగ్రెస్ రామజన్మభూమిని ప్రశ్నిస్తూనే ఉంది' అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు భక్తులను, హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయన్నారు.