విశాఖపట్నం నగరంలోని ఆరిలోవలో బుధవారం ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. అతడిని ఇద్దరు యువకులు కర్రతో తలపై కొట్టి చంపారు. బాలాజీనగర్ శివారులోని శ్మశాన వాటిక వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవ దుర్గా బజార్‌కు చెందిన రౌడీషీటర్ ఇసురుమల్లి ఆదినారాయణ (29) మద్యం సేవించడానికి మంగళవారం రాత్రి బాలాజీనగర్ శివారులోని శ్మశానవాటిక వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ బాలాజీ నగర్‌కు చెందిన జగదీష్, శివ మద్యం సేవిస్తున్నారు. అక్కడ ఎందుకు మద్యం సేవిస్తున్నారని ఆదినారాయణ ప్రశ్నించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారిద్దరూ...నీకెందుకంటూ ఎదురు ప్రశ్నించారు. దాంతో తన గురించి తెలియదని, తెలిస్తే ఇలా వాదన చేయరని గదమాయించడమే కాకుండా ఇద్దరినీ ఆదినారాయణ కొట్టాడు. ఈ క్రమంలో వారు తమ దగ్గరలో వున్న కర్ర దుంగతో ఆదినారాయణ తలపై మోదారు. దీంతో ఆదినారాయణ అక్కడికక్కడే చనిపోయాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా...నిందితులు ఇద్దరూ ఆరిలోవ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పారు. పోలీసులు ఇద్దరు యువకులను తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతుడు ఆదినారాయణ ఉరఫ్ ఆదిగా గుర్తించి ఆటోలో మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కాగా పోలీసులు హత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నది ఆరా తీస్తున్నారు.