శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం జమ్ము పంచాయతీ గడ్డెయ్య పేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జలుమూరు మండలం తిమడాం గ్రామానికి చెందిన కింజరాపు సావిత్రి (36) అనే మహిళ దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళ్ళితే... జమ్ము గ్రామానికి చెందిన సావిత్రికి భర్త శిమ్మన్న, ఇద్దరు కుమారులు వెంకటసాయి (10) దివ్యాంగుడు, ప్రియ ఆనంద్ (6) ఉన్నారు. శిమ్మన్న ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం జమ్ము గ్రామంలో జరిగిన అసిరితల్లి పండగకు సావిత్రి, కిన్నెరవాడలో జరిగిన గ్రామ దేవత పండగకు శిమ్మన్న వచ్చారు. బుధవారం మధ్యాహ్నం సావిత్రి తన అక్క కు మారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా గడ్డెయ్యపేట వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. దీంతో బైక్ పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సావిత్ర తలపై బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన ఆటో పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.