విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు బుధవారం చేపట్టిన అందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అఖిలపక్ష కమిటీ పిలుపు మేరకు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు బుధవారం గాజువాక, కూర్మన్నపాలెం, పెదగంట్యాడ, స్టీల్‌ప్లాంటు, మద్దిలపాలెం జంక్షన్లలో రాస్తారోకో చేపట్టాయి. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, అయోధ్యరామ్, వామపక్షాల నాయకులు సీహెచ్.నరసింగరావు, వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.