ఇంటర్మీడియట్‌లో ఫలితాలపై ప్రభుత్వం చర్యలకు దిగింది. హైస్కూల్ ప్లస్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో కొన్ని చోట్ల సున్నా శాతం ఫలితాలు నమోదు కావడంపై దృష్టిపెట్టింది. ఎలాగైనా ఈ చెడ్డపేరును తొలగించుకోవాలనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల కోసం ‘సన్నద్ధత తరగతులు’ ప్రారంభించింది. ప్రతి విద్యాసంస్థ వారీగా తీసుకోవాల్సిన చర్యలు, పిల్లలకు నిర్వహించాల్సిన తరగతులపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏటా ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటున్నా ఇప్పుడే ప్రత్యేక తరగతులు ప్రారంభించడానికి సున్నా శాతం ఫలితాలే కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 292 ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్ ప్లస్ పేరుతో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రారంభించారు. వాటిలో దాదాపు 150 చోట్ల పూర్తిగా సున్నా ఫలితాలు వచ్చాయి. అందుకోసమే ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు.