రాష్ట్ర హోంశాఖపై తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత రాష్ట్రంలో వర్షాలు అనంతర పరిస్థితులపై సీఎంఓ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్బంగా రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదని సీఎం అన్నారు.