వైసిపి తన మేనిఫెస్టోలోని 100 పథకాలను జగన్ ప్రకటించి ఎగ్గొట్టారని తెలుగు దేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, సాక్షి దినపత్రికకు ప్రజాధనాన్ని దోచి పెట్టడం మినహా గత నాలుగేళ్లలో ఒక్కరికి కూడా పెళ్లి కానుక ఇవ్వలేదన్నారు. నాలుగేళ్ల పాటు నిద్రపోయిన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో కల్యాణమస్తు అంటూ డ్రామాకు తెరలేపిందన్నారు.
టీడీపీ హయాంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ పెళ్లి కానుక కోసం రూ.307 కోట్లు ఖర్చు చేశామన్నారు. టీడీపీ హయాంలో రేషన్ కార్డే ప్రామాణికంగా పెళ్లిపీటల మీదే వధూవరులకు పెళ్లి కానుక ఇచ్చామని, ఇప్పుడు జగన్ కఠిన నిబంధనలతో లబ్దిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారన్నారు. రూ.10 వేలకు మించి ఆదాయం ఉన్నా 300 యూనిట్లు విద్యుత్ వాడినా పథకానికి అనర్హులంటూ నిబంధనలు దారుణమన్నారు. ఏపీకి చెందని వారికి పెళ్లి కానుక ఇవ్వరా.. పక్క రాష్ట్రాల వారిని ఇక్కడి వారు పెళ్లి చేసుకోకూడదా అని నిలదీశారు.
విలీనం పేరుతో వేలాది స్కూళ్లను క్లోజ్ చేసిన జగన్, ఇప్పుడు పదో తరగతి పాస్ అయితే పెళ్లి కానుక అని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. 4500 మందికి పెళ్లి కానుక ఇస్తున్నట్లు జగన్ ఫిబ్రవరిలో బటన్ నొక్కారని, ఇప్పటి వరకు రూపాయి రాలేదన్నారు. ఇవాళ బటన్ నొక్కి డబ్బులిస్తున్నట్లు మరో నాటకం ఆడారన్నారు. కల్యాణమిత్రలకు వేతనాల రూపంలో రూ.43 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. టీడీపీ సన్ రైజ్ పార్టీ అయితే వైసీపీ గుడ్లగూబల పార్టీ అని ఎద్దేవా చేశారు.